దేశంలో కరోనా విజృంభతో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల సామాన్యులు, పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. తాజాగా తన చావుకు లాక్‌డౌన్ పొడిగింపే కారణమంటూ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సహజన్‌పూర్ జిల్లాకు చెందిన భానుప్రకాశ్ గుప్తా హోటల్‌లో పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
అద్దె ఇంట్లో నివశిస్తున్న భాను ప్రకాశ్ కు లాక్ డౌన్ వల్ల కష్టాలు మొదలయ్యాయి. తల్లి ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో దాచుకున్న డబ్బులు అయిపోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబపోషణ భారం కావడంతో శుక్రవారం సాయంత్రం లఖింపూర్ ఖేరి జిల్లా రైల్వే స్టేషన్‌కు చేరుకొని సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి భాను ప్రకాశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం గోధుమలు, బియ్యం ఇచ్చినా నిత్యావసరాలు కొనడానికి, తల్లికి చికిత్స చేయించడానికి డబ్బులు లేవని.. అందుకే ఆత్యహత్యే శరణ్యమని భావించానని.. నా చావుకు లాక్ డౌన్ పొడిగింపే కారణం అని పేర్కొన్నాడు.