ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఇప్పటికే సైకిల్ దిగిపోగా ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ మాజీ మంత్రి వచ్చి చేరారు. ఆయనే మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి. గతంలో ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లా బాపట్ల నుంచి కాంగ్రెస్ తరపున సుదీర్ఘ కాలం పాటు అసెంబ్లీకి ప్రాథినిత్యం వహించిన గాదె టీడీపీకి గుడ్ బై చెప్పడంతో పాటు శనివారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమను టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మోసం చేశారని అన్నారు.
చంద్రబాబును ఎవ్వరూ నమ్మవద్దని ఆయన తెలిపారు. సీఎం జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని తాను వైసీపీలో చేరానని... ఎలాంటి పదవులు ఆశించడం లేదని కూడా ఆయన చెప్పారు. ఇక గతంలో తమ కుటుంబానికి టిక్కెట్ ఇస్తామని బాబు మోసం చేశారని గాదె వాపోయారు. ఇక తన కుమారుడు రాజకీయాల్లో రాణించాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇక గతంలో తాను వైఎస్ తో కలిసి పని చేశానని నాటి అనుబంధం గుర్తు చేసుకున్నారు.