మహిళలు ధరించే చున్నీలు వారి పాలిట యమపాశమై ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా కడప జిల్లా గోపవరం మండలంలో ఒక మహిళ చుట్టుకున్న చున్నీ ప్రాణాలు పోవడానికి కారణమైంది. గోపవరం మండలం పెదగోలుగుంటకు చెందిన లక్ష్మీదేవి(26) నిన్న మోటార్‌సైకిల్‌పై స్వగ్రామమైన పెదపోలుగుంట గ్రామానికి భర్తతో కలిసి బయలుదేరారు. కొన్ని రోజుల క్రితం ప్రకాశం జిల్లా చీమకుర్తికి ఉపాధి కోసం వెళ్లిన ఆమె అక్కడ ఉపాధి లభించకపోవడంతో భర్తతో కలిసి తిరిగి వచ్చారు.
వేడిగాలి తగలకుండా లక్ష్మీదేవి చున్నీని ముఖానికి కట్టుకుంది. మార్గమధ్యంలో బైక్ వెనుక చక్రానికి చున్నీ చుట్టుకోవడంతో ఆమె కిందపడింది. తల, ఛాతీకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే చనిపోవడంతో ఆమె భర్త, పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలాన్ని ఎస్సై అంబటి చంద్రశేఖర్ పరిశీలించారు. మృతురాలి సోదరుడు పొదిలి నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.