దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో అన్ని రాష్ట్రాలకు వ్యాపించిన ఈ వైరస్ తాజాగా ఎన్డీఆర్ఎఫ్ లో కలకలం రేపుతోంది. ‘ఆంఫన్’ తుపాన్ సహాయ పునరావాస పనులు చేస్తున్న 49 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరికి ఒడిశాలో కరోనావైరస్ పరీక్షలు చేసినట్టు అధికారులు తెలిపారు. వీరంతా కటక్‌లోని ముండలి ప్రాంతంలోని ఎన్‌డిఆర్‌ఎఫ్ 3వ బెటాలియన్ కు చెందినవారని తెలుస్తోంది.
170 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా పరీక్షలు చేయగా 49 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా సోకిన ఎన్డీఆర్ఎఫ్ జవాన్లను ఆసుపత్రికి తరలించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తుపాన్ సహాయ పనుల కోసం 19 బృందాలను కేంద్రం పంపించింది. ఒక్కో బృందంలో 45 మంది జవాన్లు ఉన్నారు. వీరితో పాటు దేశంలో మరో 24 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు కరోనా భారీన పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా సోకడంతో అందరికీ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.