ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం యోగి ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ నియంత్రణ కోసం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలను అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులకు చెప్పారు.
జూన్ 15నాటికి మొత్తం 75 జిల్లాల్లో ట్రూనాట్ యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచనలు చేశారు. అధికారులతో కరోనాపై సమీక్షా సమావేశం నిర్వహించి కరోనా నియంత్రణ కోసం ఆదేశాలు జారీ చేయడంతో పాటు రాష్ట్రంలో 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటన చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో స్వరాష్ట్రానికి చేరుకున్న వలస కూలీలు, కార్మికులకు, లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన యువతకు భరోసా కల్పించేందుకు సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు.