ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ థ్యాంక్స్ చెప్పారు. ఏపీ సీఎంకు తెలంగాణ మంత్రి థ్యాంక్స్ చెప్పడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా....? తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లకు వంశపారంపర్యం హక్కును కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలపడంతో మంత్రి తలసాని సీఎంకు థ్యాంక్స్ చెప్పారు. ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చినందుకు ధన్యవాదాలు అని ఆయన మీడియాకు తెలిపారు.
జగన్ ఈ నిర్ణయంతో యాదవుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి తలసాని కొనియాడారు. జగన్ పై తలసాని ప్రశంసల వర్షం కురిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లకు వంశపారంపర్యం హక్కు సమస్య చాలా కాలం నుంచి పరిష్కారం కాలేదు. సీఎం జగన్ చొరవతో తాజాగా ఈ సమస్య పరిష్కారమైంది.