సోమవారం రోజున గాల్వన్ లోయ దగ్గర చైనా భారత్ సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన సమయంలో చైనా భారత సైనికులను అపహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని తేలింది. భారత సైనిక అధికారులు గడిచిన రెండు రోజులుగా చైనా ఆర్మీ అత్యున్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపి పదిమంది సైనికులు, ఇద్దరు మేజర్ అధికారులను చైనా చెర నుంచి విడిపించినట్లు సమాచారం అందుతోంది.
ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించినట్లు తెలుస్తోంది. పరిశీలకులు 1962 తర్వాత భారత్ సైనికులు చైనాకు చిక్కటం ఇదే తొలిసారని చెబుతున్నారు. చైనా దాడిలో భారత జవాన్లు 20 మంది మృతి చెందగా 76 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.