సోమవారం రాత్రి గాల్వన్ లోయ దగ్గర చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఈ ఘర్షణలో మృతి చెందారు. సంతోష్ పై ఇనుప చువ్వలు ఉన్న రాడ్లతో చైనా సైనికులు విచక్షణారహితంగా దాడి చేశారు. అతడి తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ఆయన మృతి చెందాడు.
గురువారం రోజున సూర్యాపేట్ లో సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు పెద్దఎత్తున స్థానిక ప్రజలు హాజరయ్యారు. మంత్రి జగదీశ్ రెడ్డి కల్నల్ సంతోష్ అంత్యక్రియలు జరిగే వరకు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్ధిక సహాయంతో పాటు.. ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.