బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నేటితో 20 వసంతాలు పూర్తి చేసుకుంది. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా ఈ ఆస్పత్రి ప్రారంభమైంది. ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ 20 వసంతాలు పూర్తైన సందర్భంగా వైద్యులు, సిబ్బంది, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఫేస్ బుక్ లో భూమిపూజకు సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేసుకున్నారు.
బాలకృష్ణ తల్లి బసవతారకం గారి జ్ఞాపకార్థంగా అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1988లో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కొరకు బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్(ఐ.ఏ.సీ.వో) యుఎస్ఎ వారి సహకారంతో బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా.. 22 జూన్ 2000న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించింది. దాదాపు రెండున్నర లక్షల మంది ఈ ఆస్పత్రి ద్వారా సేవలను పొందారు.