లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గడంతో తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఏప్రిల్, మే నెలల వేతనాల్లో, పెన్షన్లలో కోత విధించిన సంగతి తెలిసిందే. జూన్ నెల నుంచైనా పూర్తి వేతం ఇవ్వాలని ఉద్యోగులు ఆర్థికమంత్రి హరీష్ రావును కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. ఎలాంటి కోతలు లేకుండా జూన్ నెల నుంచి వేతనాలు చెల్లించాలని కోరారు. మంత్రి ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ఇస్తామని చెప్పారు.
సీపీఎస్, పెన్షనర్లకు బకాయిలను వాయిదాల్లో ఇచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ వల్ల తెలంగాణ సర్కార్ సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో 75 శాతం కోత విధించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు చేస్తున్న వారి జీతాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, రిటైర్డ్ ఉద్యోగులకు అందించే పెన్షన్లలో 50 శాతం, నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత విధించింది. ఈ నెల నుంచి ప్రభుత్వం ఉద్యోగులకు, విశ్రాంత పెన్షనర్లకు పూర్తి వేతనాలు, పూర్తి పెన్షన్ ఇవ్వనుంది