తెలుగుదేశం పార్టీ నేత మంచాల రమేష్ పై నేడు గుంటూరు జిల్లా తెనాలి పట్టణం ఐతానగర్ లో హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈరోజు తెల్లవారుజామున రమేష్ ను ఇంటి నుంచి బయటకు పిలిచి ఆయనతో గొడవ పెట్టుకున్నారు. దుండగులు కత్తితో రమేష్ పై దాడి చేయగా అడ్డుగా వెళ్లిన సోదరుడు సతీష్ కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని కుటుంబ సభ్యులు సమీపంలో ఆస్పత్రికి తరలించారు.
తెనాలి టూ టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి టౌన్ 39వ వార్డు నుంచి మంచాల రమేష్ కుమార్తె కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. అందువల్లే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు తరువాత ఈ కేసులో అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది.