
ఏపీ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటుకు నేడు నామినేషన్ దాఖలైంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగియగా వైసీపీ నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఎమ్మెల్సీగా డొక్కా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.
అనంతరం ఆయన వైసీపీలో చేరారు. సీఎం జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరానని ఆయన చెప్పారు. జగన్ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామి అవుతానని అన్నారు. ఆయన రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీటును మళ్లీ ఆయనకే కేటాయించటం గమనార్హం. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన డొక్కా హోంమంత్రి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు.