దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఉత్తర ప్రదేశ్ కౌశాంబి జిల్లా పరిధిలో ఓ రైతు ఆర్థిక ఇబ్బందుల వల్ల కొడుకు విషయంలో కనికరం లేకుండా వ్యవహరించాడు. ఆకలి వేసి అన్నం తిన్న కొడుకును రెండు రోజులుగా చెట్టుకు కట్టేసి ఉంచాడు. విషయం పోలీసులకు తెలియడంతో వాళ్లు యువకుడిని విడిపించి వైద్యం చేయించారు.
కౌశాంబి పట్టణంలో కందైలాల్ అనే వ్యక్తి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవడు. కొడుకు విజయ్ మాత్రం ఎలాంటి పనిచేయకుండా తిరుగుతున్నాడు. లాక్ డౌన్ వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుండటంతో ఎవర్నీ అడకుండానే ఇంట్లో వండిన అన్నం తిన్న విజయ్ ను కందైలాల్ ఇనుప గొలుసులతో ఇంటి ముందు చెట్టుకు కట్టేసి కొట్టాడు. తన కుమారుడు విజయ్ ఏ పని చేయకుండా బలాదూర్‌గా తిరుగుతుండటం వల్లే అలా చేశానని కందైలాల్ చెబుతున్నాడు. ఇంట్లో వాళ్లకు లేకుండా కుమారుడు తినడం వల్ల వాళ్లంతా కడుపుమాడ్చుకోవాల్సి వచ్చిందని కందైలాల్ చెబుతున్నాడు.