భారత్ లో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడంలేదు. రోజుకి సగటున 15వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటాయి. దేశంలో ఒక్కరోజులో దేశవ్యాప్తంగా అత్యధికంగా 18,276 కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే ఒక్కరోజులో ఐదు వేల కేసులు నమోదుకావడం గమనార్హం. ఇక ఢిల్లీ, తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాల్లోకూడా కరోనా రోజు రోజుకీ విజృంభిస్తూనే ఉంది. తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ ) ఉద్యోగి కరోనా వైరస్ తో మరణించిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. కరోనాతో మరణించిన ఉద్యోగి దక్షిణ ఢిల్లీలోని ఆరు అంతస్తుల మానవాధికార్ భవన్ లో విధులు నిర్వహించడంతో వైద్యాధికారులు ఎన్‌హెచ్‌ఆర్సీలో ఇతర ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు.
ఈ నేపథ్యంలో మరో 17మంది ఎన్‌హెచ్‌ఆర్సీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. కొందరు సీనియర్ ఉద్యోగులకు కూడా కరోనా సోకింది. దీంతో వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కరోనాత మరణించిన ఉద్యోగి ఎక్కడెక్కడ తిరిగి ఉంటారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
అంతే కాదు ఎన్‌హెచ్‌ఆర్సీలో ఈ నెల 12 నుంచి 24వతేదీ వరకు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధికారులు ఎన్‌హెచ్‌ఆర్సీ కార్యాలయాన్ని సందర్శించి శానిటైజ్ చేయించారు. 5,6 అంతస్తులను మరోసారి శానిటైజ్ కోసం మూసివేశారు.