దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా గజగజా వణికిస్తోంది. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కేబినేట్ లోని మంత్రికి, ఎమ్మెల్యేకు కరోనా నిర్ధారణ అయింది. జేఎంఎం పార్టీకి చెందిన ఆ మంత్రికి నిన్న సాయంత్రం కరోనా నిర్ధారణ కాగా రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు ఆయనను తరలించారు. అంతకుముందే ఒక ఎమ్మెల్యేకు కరోనా నిర్ధారణ అయింది.
53 ఏండ్ల ఆ ఎమ్మెల్యే ధన్‌బాద్‌లోని బీసీసీఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం వీళ్లిద్దరూ సీఎం హేమంత్ సొరేన్ ను కలిశారు. దీంతో సీఎం, ఉన్నతాధికారులు కరోనా సోకుతుందేమో అని భయాందోళనకు గురవుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల మేరకు వీళ్లు హోం క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా సోకిన ఎమ్మెల్యే సోమవారం రోజున సింద్రీలో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. దీంతో ఆ కార్యక్రమానికి హజరైన 150 మంది టెన్షన్ పడుతున్నారు. జార్ఖండ్‌లో ఇప్పటివరకు 3000 కరోనా కేసులు నమోదు కాగా నిన్న ఒక్కరోజే 149 మందికి వైరస్ నిర్ధారణ అయింది.