మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్ల నుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర రాజ్ భవన్ లో కరోనా కలకలం రేపుతోంది. రాజ్ భవన్ లో ఏకంగా 18 మంది సిబ్బంది కరోనా భారీన పడటం చర్చనీయాంశమైంది. సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ అప్రమత్తమయ్యారు. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
రాజ్ భవన్‌లోని 100 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా 18 మంది వైరస్ భారీన పడ్డారని తేలింది. ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్రాన్ని కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. గత 24 గంటల్లో అక్కడ 7,862 మందికి వైరస్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,38,461 కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారులు ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.