తెలంగాణ సర్కార్ కు హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై ఈ నెల 15వ తేదీ వరకు స్టేను పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పి ఎల్ నాగేశ్వరరావు అనే వ్యక్తి సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.
నేడు పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30వ తేదీన సచివాలయం కూల్చివేత గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పగా తుది నిర్ణయం తీసుకున్నట్లు కోర్టుకు తెలపాల్సిన అవసరం ఉంది కదా....? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వం రహస్యమని భావిస్తే షీల్డ్ కవర్ లో కోర్టుకు తెలపాలని సూచనలు చేసింది. కొంత సమయం ఇస్తే కోర్టుకు పూర్తి వివరాలు తెలుపుతామని ఏజీ చెప్పారు.