కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎవరి ఊహకు అందని వాస్తవాలు వెలుగులోకి వసున్నాయి. ఎన్‌ఐఏ అధికారుల దర్యాప్తులో 180 కేజీల బంగారం దొంగ రవాణా జరిగినట్లు తేలింది. విమానాల ద్వారా దాదాపు 13 సార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దౌత్య మార్గాల ద్వారా బంగారం స్మగ్లింగ్ జరిగిందని తాము నిర్ధారణకు వచ్చామని వాళ్లు చెబుతున్నారు. స్మగుల్ చేసిన బంగారం ద్వారా వచ్చిన మొత్తం డబ్బు తాము అంచనా వేసినదానికన్నా ఎక్కువగా ఉందని తెలిపారు.
ఎన్‌ఐఏ ఇప్పటికే సరిత్, స్వప్న సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్‌లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసింది. సందీప్ నాయర్, రమీజ్ అనే ఇద్దరు నిందితులకు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో లింక్ ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. స్మగ్లింగ్ ద్వారా వఛ్చిన సొమ్మును హవాలా మార్గాల ద్వారా దుబాయ్‌కి తరలించారని.. ఈ వ్యవహారమంతా ఫాజిల్ ఫరీద్ అధ్వర్యంలో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు ఈ నెల 4వ తేదీన 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.