17 సంవత్సరాల క్రితం గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ పేరు వింటే సామాన్యుల నుంచి అధికారుల వరకు ఎవరైనా గజగజా వణకాల్సిందే. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వీరప్పన్ గడగడలాడించారు. గంధపు చెక్కల స్మగ్లర్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన 2004 లో ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఆయన కూతురు విద్యా వీరప్పన్ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో బీజేపీలో చేరగా తాజాగా అమెకు కీలక పదవి లభించింది.
తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా బీజేపీ ఆమెను నియమించింది. న్యాయవాది అయిన విద్య పార్టీలో చేరిన రోజు నుంచి పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ వీరప్పన్ వర్గాన్ని పార్టీ వైపుకు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఆమెకు పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఆమెకు పదవి లభించింది.