ఏపీలో కొద్ది రోజులుగా వైసీపీ నుంచి ఎవరు ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారన్న దానిపై కాస్త సస్పెన్సే నెలకొంది. దీనిపై పార్టీ వర్గాల్లో తీవ్ర తర్జన భర్జనలు కూడా జరిగాయి. తాజా అప్‌డేట్ ప్రకారం పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు, జకియా ఖానుం పేర్లను వైసీపీ అధినేత జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ రెండు సీట్లకు వీరిపేర్లను జగన్ డిసైడ్ చేశారంటున్నారు.
ఎస్సీ సామాజికవర్గం లో పండుల రవీంద్రబాబుకు, మైనారిటీ కోటాలో కడప జిల్లాకు చెందిన జకియా ఖానుం పేర్లు ఖరారరయ్యాయి. రేపు గవర్నర్ వద్దకు ఈ రెండు పేర్లను పంపే అవకాశముంది. ఇక పండుల రవీంద్ర బాబు మాజీ ఐఆర్ఎస్ అధికారి. ఆయన 2014లో రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక జకియా ఖాన్ రాయచోటి నియోజకవర్గానికి చెందిన మైనార్టీ మహిళా నేతగా ఉన్నారు. వీరిలో టీడీపీ నుంచి వచ్చిన రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ మాత్రం ఊహించని పరిణామం అని పార్టీ వర్గాలు అంటున్నాయి.