ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మంత్రి కొడాలి నాని ఇవాళ బీజేపీపై  ఒక రేంజ్‌లో ఫైర‌య్యారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై వ్యాట్ త‌గ్గించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ, వైకాపా నేత‌ల మ‌ధ్య‌ ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఈ త‌రుణంలోనే మంత్రి కొడాలి నాని మీడియా స‌మావేశంలో మాట్లాడారు. బీజేపీపై పెట్రోల్, టీడీపీ పై డీజిల్ పోసి ప్ర‌జ‌లు త‌గుల‌బెట్టార‌ని మంత్రి  నాని మండిప‌డ్డారు.

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన మూడు పార్టీలు కుమ్మక్కై పోటీ చేసినా డిపాజిట్ కూడ ద‌క్క‌లేద‌ని గుర్తు చేసారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే అక్క‌డ మూడింట్లో బీజేపీకి అక్క‌డ డిపాజిట్ కూడ ద‌క్కించుకోలేద‌ని చుర‌క‌లు అంటించారు. రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు పెట్రోల్‌, డీజిల్ పోసి నిప్పు అంటిస్తార‌ని భ‌య‌ప‌డే రూ.5 త‌గ్గించారు అని మంత్రి పేర్కొన్నారు. రూ. 50 వ‌ర‌కు పెంచి ఇప్పుడు కేవ‌లం రూ.5 త‌గ్గించ‌డంతో పాటు బీజేపీ నేత‌లు ఎంత త‌గ్గిస్తార‌ని అడుగడం సిగ్గు చేటు అన్నారు. స‌ర్‌చార్జీలు, సెస్‌లు, పెట్రోల్ ఉత్ప‌త్తులు వంటివ‌ని కోట్ల రూపాయ‌లు కేంద్రం దండుతుంద‌ని ఆగ్ర‌హించారు. బీజేపీ చేసిన పాపాల‌ను సీఎం జ‌గ‌న్ మీద రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అని, దేశాన్ని ఏలే పార్టీ అని చెప్పుకుంటున్నార‌ని, కానీ రాష్ట్ర పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని  ఎద్దేవా చేసారు.  ప్ర‌జ‌లు టీడీపీ, బీజేపీ నేత‌ల‌కు బుద్ధి చెబుతున్నా.. ఇంకా బుద్ధి రావ‌డం లేద‌ని మండిప‌డ్డారు మంత్రి కొడాలి నాని.
 

మరింత సమాచారం తెలుసుకోండి: