సరైన కారణంగా లేకుండా కరెంటు కట్ చేస్తే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించారు. విద్యుత్త కోతలు విధించాలని ప్రభుత్వం చెప్పలేదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేయడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

గ‌త ఏడాదితో పోల్చితే గ‌త రెండు నెల‌ల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా ఎక్కువ‌గా చేసినట్లు ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఇటీవ‌ల రాష్ట్రంలో మూడు సబ్ స్టేషన్ల ప‌రిధిలో లోడ్ హెచ్చుతగ్గులను గమనించక పోవడం వల్ల కొంత సేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింద‌ని సీఎండీ రిజ్వీ చెప్పారు. విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై క‌ఠిన చర్యలు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మ‌ర‌మ్మతుల వల్ల విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే వినియోగ‌దారుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. అయిదు నిమిషాల‌కు మించి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతే వెంటనే కార‌ణాల‌పై స‌మీక్షించుకోవాలని సీఎం చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: