2024 నుంచి 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటుందంటున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. గతంలో టీడీపీ,కాంగ్రెస్‌, తెరాస పార్టీలు పదేళ్ల చొప్పున ఈ రాష్ట్రాన్ని పాలించాయన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్ కూడా పదేళ్లు అధికారంలో ఉండి తీరాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోసే దమ్ము ఎవరికీ లేదన్న రేవంత్‌ రెడ్డి.. ఎవరైనా తోక జాడిస్తే... కత్తిరించే కత్తెర నా చేతిలోనే ఉందన్నారు. కేడీ, మోడీ కలిసి ఎస్సీలకు అన్యాయం చేశారని.. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిపించేంత వరకు కార్యకర్తలు విశ్రమించవద్దని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

పాలమూరు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటే ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. పదేళ్లు గడిచినా.. ప్రధాని మోదీ తన హామీని నెరవేర్చలేదని.. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాని భాజపా నేతలకు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని చెప్పాం... ఇచ్చి చూపిస్తున్నామని.. ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నామని.. పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వనున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: