మంచిర్యాల జిల్లాలోని  జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయస్థాయిలో సత్తా చాటింది. నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ యూనిట్ గా అరుదైన అవార్డును అందుకుంది. ప్రతిష్టాత్మక కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవ వేడుకలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి  బెస్ట్ నేషనల్ వాటర్ ఎఫిషియంట్ యూనిట్ అవార్డును అతిథులు అందజేశారు. జాతీయస్థాయిలో 500 మెగావాట్ల పైబడిన సామర్థ్యం గల సుమారు 150 ప్రభుత్వ,ప్రైవేట్  రంగ విద్యుత్ కేంద్రాలలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ అవార్డును సాధించింది.

సాధారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఒక గంటలో ఒక మెగా వాట్  విద్యుత్ ఉత్పాదనకు గరిష్టంగా  మూడు ఘనపు మీటర్ల నీటిని వినియోగించడాన్ని  సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక ప్రామాణికంగా సూచిస్తుంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం  తీసుకున్న ప్రత్యేక చర్యలు, వినియోగిస్తున్న సాంకేతికత వలన  ఒక గంటలో  మెగావాట్ విద్యుత్ ఉత్పాదనకు  నిర్దేశించిన ప్రమాణాల  కన్నా తక్కువగా అంటే 2.8 ఘనపు మీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: