కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించలేదని... ఇపుడు తెలంగాణ చరిత్ర, అస్థిత్వంపై పెద్దఎత్తున దాడి జరుగుతోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. కొన్ని వర్గాల వారు చేస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పడి బలి కాబోతోందని బీఆర్‌ఎస్‌ నేతలు  వ్యాఖ్యానించారు. ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టే... భయంతో చిహ్నాలు మారుస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాట చరిత్రను మార్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని, అధికారం మారినప్పుడల్లా చిహ్నాలు మారుస్తూ పోతే ఎలా అని బీఆర్‌ఎస్‌ నేత దేవీ ప్రసాద్‌ ప్రశ్నించారు.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంటేనే అమరవీరుల యాది అన్న దేవీప్రసాద్... జూన్ ఒకటో తేదీన అమరులకు నివాళిగా చేపడుతున్న ర్యాలీలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని కోరారు. తెలంగాణ పునాదులు, అస్థిత్వంపై సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుంటే పక్కనున్న కోదండరాం ఎందుకు మాట్లాడడం లేదని మరో బీఆర్‌ఎస్‌ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఉద్యమకారులు తిరగబడతారని పేర్కొన్నారు. చార్మినార్ ను తొలగిస్తుంటే అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు మాట్లాడడం లేదన్న ఆయన... ఈ పరిణామాలపై కోదండరాం, ఒవైసీ స్పందించాలని డిమాండ్ చేశారు.


ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి మరల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం చిహ్నాల మార్పును ఎత్తుకొందని... అధికారిక చిహ్నంలో అమరవీరుల స్థూపం పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అమరవీరులను ప్రేమించినట్లు కాదని దేవీప్రసాద్ ఆక్షేపించారు. అమరవీరులను తలుచుకునే అర్హత, నైతికహక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్న ఆయన... గన్ పార్క్ లోని అమరుల స్థూపం కాంగ్రెస్ పార్టీ దమనకాండకు చిహ్నమని పేర్కొన్నారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధి, వికాసాన్ని... విధ్వంసంగా చూపే కుట్ర జరుగుతోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: