ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు పై ఇంకా స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. వైసిపి హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు.పదివేల రూపాయల వేతనంతో వలంటీర్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే వైసీపీ నేతలు అప్పట్లో వలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు గాను.. దాదాపు లక్షన్నర మంది రాజీనామా చేశారు. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. రాజీనామా చేయని వారు మాత్రం తటస్థంగా ఉన్నారు. తమను ఇప్పుడు కొనసాగిస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే దీనిపై మంత్రులు భిన్నంగా ప్రకటనలు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూనే.. చేర్పులు మార్పులు ఉంటాయని సంకేతాలు ఇస్తున్నారు. వాలంటీర్లు లేకుండానే వరుసగా రెండు నెలల పాటు పింఛన్లు పంపిణీ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. వాలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేయగలమని రుజువు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులతో విజయవంతంగా పింఛన్లు పంపిణీ చేయగలిగారు. దీంతో వాలంటీర్లలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. అసలు కొనసాగిస్తారా? లేదా? అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. నేటి సాయంత్రం వరకు డెడ్ లైన్ ప్రకటించింది. అంతలో ఆ పని చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వా హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్‌ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్‌ గ్రూపులను, టెలిగ్రామ్‌ గ్రూప్స్‌‌ను క్రియేట్ చేశారని.. వీటి ద్వారా ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలకు వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణల వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. వెంటనే అటువంటి క్షస్టర్‌ గ్రూపులను ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల లోపు డిలీట్‌ చేయాలని ఆదేశించింది.

గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు పథకాలు, నిర్ణయాలను ప్రజలకు అందించేందుకు వాట్సప్, టెలిగ్రాం గ్రూపులను నిర్వహించారు. తమ క్లస్టర్ పరిధిలోని లబ్దిదారులతో ఈ గ్రూపులను కొనసాగించారు. వాలంటీర్లు నిర్వహించిన అన్ని గ్రూపులను తొలిగించాని వార్డు, గ్రామ సచివాలయాల ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో వెంటనే ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.తొలిగించిన గ్రూపుల వివరాలు ఈ సాయంత్రం లోపు ఇవ్వాలని నిర్దేశించారు.ప్రజలను కూడా ఆ వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం వాలంటర్లకు అందించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను వార్డు, గ్రామ సచివాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎన్నికలు పూర్తయిన తరువాత ఇప్పటి వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఇక..రాజీనామా చేసిన వాలంటీర్లను మినహాయించి మిగిలిన వాలంటీర్ల కొనసాగింపు విషయంలోనూ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత రావటం లేదు.వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మంత్రులు చెబుతున్నారు. అయితే, వాలంటీర్ల ప్రస్తుత సంఖ్యను తగ్గిస్తూ..సేవలను పరిమితం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అదే సమయంలో వాలంటీర్ల విద్యార్హతల ఆధారంగా వారికి స్కిల్ శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వాలంటీర్లకు రూ 10 వేలు చొప్పున వేతనాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్ల కొనసాగింపు..విధి విధానాల ఖరారు పైన అధికారుల నుంచి నివేదిక కోరారు. ఈ నెల 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు..విధుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.ఇప్పటికే అనుమానంతో ఉన్న వాలంటీర్లకు ఈ ప్రకటనతో ఒక రకమైన స్పష్టత వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: