ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫోటోలు తీసి అప్లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఈ మేరకు ఐఎంఎoఎస్ యాప్ లో ఈ ఆప్షన్ను సైతం తాత్కాలింగా తొలగించింది.ఆ బాధ్యతలను ఇతర విభాగాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది. కాగా ప్రస్తుతం రోజుకు ఉపాధ్యాయుడు ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు.గత ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి.. నాడు-నేడు. దీనికింద రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా మౌలిక సదుపాయాలను కల్పించింది.కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దింది. ఇంగ్లీష్‌లో విద్యాబోధనకూ శ్రీకారం చుట్టింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నాడు- నేడు పథకంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చంద్రబాబు సర్కార్ దీన్ని కొనసాగిస్తుందా? లేదా? అనే చర్చ మొదలైంది.

దీనిపై ఇదివరకే అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్. నాడు- నేడు పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు కోర్టులో పిటీషన్ వేశారని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏడాది లోగా ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటుకు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ ఇచ్చారు. ఇకపై ఉదయాన్నే పాఠశాలల్లోని మరుగుదొడ్ల ఫొటోలను పంపించనక్కర్లేదని అన్నారు. ఉపాధ్యాయులందరూ కూడా పాఠ్యాంశాల బోధనపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.మరుగుదొడ్ల ఫొటోలను తీసి అప్‌లోడ్ చేసే పని ఇక ఉపాధ్యాయులకు లేదని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ విధానాన్ని అపేసినట్లు వెల్లడించారు. వాటి ఫొటోలను అప్‌లోడ్ చేసే ఆప్షన్‌ను యాప్‌లో నుంచి కూడా తొలగించామని అన్నారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకి అందించాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా క్రమశిక్షణ, ఉన్నత విలువలతో తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో టీచర్లు ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామని నారా లోకేష్ వారికి భరోసా కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: