అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడిన వారిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్‌ ఆస్పత్రికి వెళ్లి బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు జగన్ సూచించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు తమ పార్టీ నేతలు అందుబాటులో ఉంటారని చెప్పారు. పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.అచ్చుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు.. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హోం మంత్రి పర్యవేక్షణకు వెళ్తున్నాను అన్నమాటే లేదు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారని జగన్ అన్నారు.గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ఘటన జరిగితే వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది. 
తెల్లవారు జామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు. నేను ఉదయాన్నే 11గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లాను. 24గంటల వ్యవధిలోనే పరిహారం ఇప్పించాం. 

కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదేనని జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి అందలేదు.  వారంలోగా భాదితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్ లైన్ విధించారు.ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. ప్రకటించిన నష్టపరిహారం అందజేయాలి. వారం లో పరిహారం ఇవ్వలేదంటే బాధితుల పక్షాన ధర్నాకు దిగుతాం. అవసరమైతే నేనే వచ్చి ధర్నాలో కూర్చుంటానని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.అచ్యుతాపురం ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు.. మెడికవర్ ఆసుపత్రిలో ఏడుగురు బాధితులు, కిమ్స్ లో ఐదుగురు బాధితులు.. ఉష ప్రైమ్ ఆస్పత్రిలో 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.. ప్రమాదంలో ఇప్పటికే 17 మంది ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు.. గురువారం రోజు క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. పూర్తిస్థాయిలో కోలుకునేవరకు వైద్యం అందిస్తామని తెలిపారు.. మృతుల కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ఓదార్చారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. ఇక, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు.. గాయపడినవారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: