టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని నిర్మించిన అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత కొన్నేళ్లుగా ఈ అక్రమ కట్టడంపై అనేక ఆరోపణలు వచ్చినా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేకపోయింది.అందుకు కారణం ఆయా ప్రభుత్వ నేతలతో నాగ్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలే అనే వాదన వినిపించింది. అయితే తాజాగా హైడ్రా చేపట్టిన కూల్చివేతలో భాగంగా నాగార్జునకు చెందిన కన్వెన్షన్‌పై చర్యలు చేపట్టారు. ఆ వివాదాస్పద కట్టడం వివరాల్లోకి వెళితే..సినీ హీరో నాగార్జున మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని తుమ్మిడి కుంట ప్రాంతంలోని ఓ చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అనే ఆరోపణలు అప్పట్లో హరీష్ రావుతో సహా ఇతర టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే ఆ సమయంలో కూల్చివేతకు సిద్దం కావడంతో పార్టీ లోని కీలక నేతతో ఉన్న సన్నిహిత రిలేషన్స్ వల్ల అది ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.ఇక తమ్ముడికుంట చెరువును సుమారుగా 3 ఎకరాలు ఆక్రమించారు. 2 ఎకరాలు బఫర్ జోన్‌లో ఉంది. మరో 1.12 ఎకరాలు చెరువు శిఖం కిందకు వస్తుంది.

అయితే చెరువును ఎవరూ ఆక్రమించకుండా 2 ఎకరాలను బఫర్ జోన్‌గా పెడుతారు. కానీ నాగార్జున ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టడం సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి.అయితే 3.5 ఎకరాల ఆక్రమిత భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని పలు ఫిర్యాదులు వచ్చాయి. కానీ గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టు వ్యవహరించింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూకబ్జాలు, ఆక్రమణలపై దృష్టిపెట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రముఖులు ఆక్రమించిన స్థలాల్లో నిర్మించిన భవనాలు, ఇతర కన్వెన్షన్లపై దృష్టి పెట్టి కూల్చివేసింది. ప్రస్తుతం కూల్చివేతల వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు నోటీసులు ఇవ్వడం.. చివరకు లాబీయింగ్‌తో లొంగిపోయి వదిలేయడం జరిగింది. కానీ రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంపై హర్షం వ్యక్తమవుతున్నది.ఇదిలావుండగా మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున  స్పందించారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించారు.''ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిని. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేం ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను'' అని నాగార్జున పేర్కొన్నారు.ఇదిలా ఉండగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నెలకొంది. అందులో అద్దె రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇందులో 37వేలు ,27వేలు , 7వేలు 5వేలు చదరపు అడుగులు విస్తీర్ణంతో నాలుగు హాళ్లు ఉంటాయి. ఫ్యాషన్ షోలు, వార్షిక వేడుకలు, వివాహాలు, గెట్ టుగెదర్ పార్టీలు ఇందులో జరుపుకుంటారు. అక్కడ ఎకరా భూమి రూ.100 కోట్లు విలువ చేస్తుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: