భారత్ పాక్ విభజన అనంతరం నుంచి 2001 వరకు పాకిస్థాన్ కు మద్దతుగానే నిలిచింది అమెరికా. భారత్ ను అసలు నమ్మకమైన మిత్రుడిగానే భావించలేదు. ఉగ్రవాదంతో ఎంతగా సతమతం అవుతున్నా మన దేశం ఘోషను పట్టించుకోలేదు.
చివరకు టెర్రరిజంతో భారత్ ఎలాంటి బాధను అనుభవిస్తున్నదో.. 2001 నాటి ఉగ్ర దాడులతో కాని అమెరికాకు తెలిసిరాలేదు. అయినా.. పాకిస్థాన్ కు కాస్తోకూస్తో మద్దతుగానే నిలిచేది. దీనికి ఉదాహరణ.. భారత్ కు వచ్చిన ప్రతి అధ్యక్షుడు తిరుగు ప్రయాణంలో పాకిస్థాన్ ను సందర్శించడం. ట్రంప్, బైడెన్ వచ్చాకనే కాస్త పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కాగా, కొద్ది రోజుల కిందట దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాక్ కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. దీన్నిబట్టే అమెరికా వైఖరిలో మార్పు ఏమిటో తెలుస్తోంది.
పాక్ దీర్ఘ శ్రేణి క్షిపణులు తయారుచేయడం తమకు సైతం ముప్పేనని అమెరికా అంటోంది. ఇక సహజంగానే దక్షిణాసియా దేశాలకు ఈ ముప్పు ఇంకా ఎక్కువ. దీంతోనే పాకిస్థాన్ కు చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించారు. వాస్తవానికి పాక్ తో అమెరికాకు దశాబ్దాలుగా విడదీయరాని బంధం. అలాంటిది 2021లో ఆఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగాక సంబంధాలు తగ్గాయి.
అందుకే ఆ దేశం దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల తయారీకి మద్దతు ఇవ్వడం లేదు. ఇలాంటి క్షిపణులను అభివృద్ధి చేస్తుందనే ఆందోళనతోనే ఆంక్షలు విధించింది.
ఇక అమెరికా ఆంక్షలు విధించిన పాక్ సంస్థల్లో ఆ దేశ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్ (ఎన్‌డీసీ) ఉంది. అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్ సైడ్ ఎంటర్‌ప్రైజెస్ మిగతా సంస్థలు. ఎన్డీసీ తప్ప మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పని చేస్తున్నాయి.