తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే... బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. మరీ ముఖ్యంగా  బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి.ప్రత్యక్షసాక్షులు, ఇతర వర్గాల కథనం ప్రకారం బైరాగిపట్టెడలోని రామానాయుడు మునిసిపల్‌ హైస్కూలు ఆవరణలో టోకెన్ల జారీకి పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ఇక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. హైస్కూలు వెనుకవైపు ఉన్న మునిసిపల్‌ పార్కులో కూర్చుని క్యూలైన్లలోకి ప్రవేశించేందుకు ఎదురు చూస్తున్నారు. రాత్రి 8.50 సమయంలో క్యూలైన్లలోకి అనుమతించడంతో ఒక్కసారిగా అందరూ లేచి పరుగులు తీశారు. పార్కు నుంచి స్కూలులోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటుపై జనం పడటంతో అది ఒక్కసారిగా తెరుచుకుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది.భక్తుల్లో మహిళలు, వృద్ధులు కూడా ఉండడంతో చాలామంది కిందపడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అదుపు చేసేసరికే దారుణం జరిగిపోయింది. 

తొక్కిసలాటలో చిక్కుకున్న పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మొత్తం 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు, సీపీఆర్‌ వంటి చర్యలు చేపట్టారు. మరో కథనం ప్రకారం బైరాగిపట్టెడ కేంద్రంలో ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు అక్కడున్న పోలీసు అధికారి గేటును తెరిచారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు.ఇదిలావుండగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడటం వంటి ఘటనలు జరిగినప్పటికీ మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.అలాగే కౌంటర్ల వద్ద కనీసం సౌకర్యాలు కల్పించలేదు, పోలీసుల నిర్లక్ష్యం బాగా ఉంది. అర్థగంట ముందుగా వచ్చిన రద్దీని కంట్రోల్‌ చేసుంటే కచ్చితంగా తొక్కిసలాట జరిగేది కాదు. అలాగే సకాలంలో స్పందించి వుంటే కూడా ఈ దారుణం చోటుచేసుకునేదికాదు అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: