
పదేపదే గడువులు కోరొద్దని హెచ్చరించిన హైకోర్టు తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. తన ఫోన్‌ని టాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొనడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేయాలని హరీష్ రావు, రాధాకిషన్ రావు హైకోర్టులో వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు గత విచారణ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో విచారణలో ఉండగానే.. పోలీసులు వాదనలు వినిపించడానికి గడువులు కోరుతూ.. ఈ కేసులో అమాయకులను అరెస్ట్ చేస్తున్నారని హరీష్ రావు తరఫు న్యాయవాది గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు దర్యాప్తుపై స్టే విధించింది. స్టే ఎత్తివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసిన పిటీషన్‌పై 27వ తేదీన వాదనలు జరగుతాయి.