తెలంగాణలో ఈ సారి బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన ఏపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను రాష్ట్ర నాయకులు శాలువాతో సత్కరించారు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పలువురు పార్టీ కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కుల గణన ప్రక్రియను ప్రభుత్వం సరిగా నిర్వహించలేదని విమర్శించారు.


సర్వే విషయంలో మేథావులు , ప్రొఫెసర్ల అభిప్రాయం తీసుకున్నా బావుండేది అభిప్రాయపడ్డారు. మోదీ సారథ్యంలో భారత్ ప్రతిష్ట ఖండాతరాలు దాటిందన్న ఆయన... మోదీ ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి  ప్రధాని మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.


మరోవైపు బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతిచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. పార్టీ తరఫున ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు లేనందున..  బీసీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. ఒకవేళ మద్దతివ్వకపోతే బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కును బీఆర్‌ఎస్ పార్టీ కోల్పోతుందని జాజుల వెల్లడించారు.


బీసీ వాదంతో వస్తున్న కవిత... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వైఖరేంటో స్పష్టం చేయాలని ఆయన పేర్కొన్నారు. బీసీలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కాకుండా.. వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి బీఆర్‌ఎస్‌ కృషి చేయాలని లేఖలో రాసుకొచ్చారు. బీసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు పూల రవీందర్, ప్రసన్న, హరికృష్ణ, మల్కా కొమురయ్యలకు మద్దతిచ్చి బీఆర్‌ఎస్‌ పార్టీ చిత్తశుద్ధని నిరూపించుకోవాలని జాజుల స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: