తెలంగాణ కాంగ్రెస్ లో కుల రాజకీయం ముదురుతోంది. ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్లపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌ కుమార్ యాదవ్‌.. రెడ్డి సామాజికవర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రెడ్డి నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అడ్డుకున్నారని అంజన్‌ కుమార్ యాదవ్‌ ఆరోపించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కాకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి అడ్డు తగిలారని..తాను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుతగిలింది కూడా ఈ నేతలనేనని అంజన్‌ కుమార్ యాదవ్‌ అన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్‌ చెప్పడం మూలంగానే సోనియాగాంధీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేశారని అంజన్‌కుమార్‌ యాదవ్‌  పేర్కొన్నారు. ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణంలో అంజన్‌కుమార్ అధ్వర్యంలో యాదవుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్‌ కుమార్ యాదవ్‌ మాట్లాడారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని  భజన సంఘాలు పార్టీలోకి వచ్చాయన్న అంజన్‌ కుమార్ యాదవ్‌..  తనకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మాకు అన్నిట్లో ప్రాధాన్యత లేకుంటే ఇప్పటి నుండి ఊరుకునేది లేదని అంజన్‌ కుమార్ యాదవ్‌ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి జిల్లాల్లో యాదవుల బిడ్డలకు స్టడీ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అంజన్‌ కుమార్ యాదవ్‌ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: