
గుజరాత్ నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. చైతన్యపురి పరిధిలో నవజాత శిశువును విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో..ఎస్వోటీ పోలీసులతో కలిసి దాడులు చేశారు. నలుగురు చిన్నారులను రక్షించి.. 11 మందిని నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు విక్రయదారులు. ఐదుగురు పిల్లలను కొనుగోలు చేసినవారు ఉన్నారు.
నిందితులు తెలుగురాష్ట్రాల్లో పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలు కావాలనుకునేవాళ్లు చట్టప్రకారం దత్తత తీసుకోవాలి కానీ.. ఇలా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సీపీ సుధీర్‌బాబు హెచ్చరించారు. పిల్లలను కొనుగోలు చేసిన వాళ్లలో అందరూ చదువుకున్న వాళ్లే కావడం గమనార్హమని రాచకొండ సీపీ సుధీర్‌బాబు చెప్పుకొచ్చారు.
రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇంకా ఏమన్నారంటే.. నిందితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను విక్రయించారు.. గుజరాత్ కు చెందిన వందన... అక్కడి నుంచి సునీతాసుమన్, సావిత్రి దేవిల ద్వారా పిల్లలను పంపిస్తుంది. వీళ్ళ నుంచి కృష్ణవేణి, దీప్తి అనే వాళ్ళు కొని ఇక్కడ విక్రయిస్తున్నారు. పిల్లలను ఇంకొకరికి అమ్మేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తుండగా ఇవాళ ఉదయం పట్టుకున్నాం. కోలా కృష్ణవేణి, దీప్తిలు... ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను విక్రయించారు అన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించి కేవలం డబ్బు కోసం నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అమ్ముతున్నారు. కొనే వాళ్లు కూడా పిల్లలు ఎవరు.. ఏంటి.. అని తెలుసుకోకుండా డబ్బులు పెట్టి కొన్నందుకు వాళ్ళని కూడా అరెస్టు చేశాం. కృష్ణవేణి ఇప్పటికే ఒక కేసులో నిందితురాలు అని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.