కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఇవాళ మరోమారు జరగనుంది. చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదికకు అనుగుణంగా రెండు రాష్ట్రాలకు నీటి విడుదలపై ఇవాళ్టి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ ఈ  మధ్యాహ్నం సమావేశం కానున్నారు. కనీస నీటివినియోగ మట్టానికి ఎగువన ప్రస్తుతం శ్రీశైలంలో 24 టీఎంసీలు, సాగర్ లో 42.3 టీఎంసీల నీరు ఉన్నట్లు కేఆర్ఎంబీ నిన్నటి సమావేశంలో పేర్కొంది.


జూలై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేసుకోవాలని రెండు రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగాన్ని తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీటి కోసం మాత్రమే తీసుకోవాలన్న బోర్డు తెలిపినట్టు తెలిసింది.  సాగర్ కుడికాల్వ నుంచి తీసుకునే నీటిని కూడా తక్షణమే 7000 క్యూసెక్కులకు తగ్గించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీకి సూచించినట్టు తెలిసింది.


ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సాగునీటి అవసరాలపై రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు ఉమ్మడిగా నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీ సూచించింది. మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల ప్రణాళిక కూడా అందులో ఉండాలని పేర్కొంది. సీఈల నివేదిక ఆధారంగా ఇవాళ్టి సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి విడుదల విషయమై కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీకి షాక్ తప్పేలా లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: