
మాజీ క్రికెటర్ ఎంఎస్‌కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆకాడమీలో మన తదుపరి సిరాజ్ ఎవరు అనే ట్యాగ్ లైన్ తో ఆరాంఘర్‌లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో బౌలింగ్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరాజ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సుమారు 400 మంది ఔత్సాహిక క్రికెటర్లు ఈ బౌలింగ్ ట్రయల్స్ లో పాల్గొన్నారు.
యువ క్రికెటర్లు ఈ ట్రయల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎంపి అసదుద్దీన్ ఓవైసి పిలుపునిచ్చారు. ట్రయల్స్ ద్వారా ప్రతిభావంతులను గుర్తించి తన అకాడమీలో ఉచిత శిక్షణ అందించడానికి ముందుకు వచ్చిన ఎమ్మెస్కే ప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆయన అభినందించారు.
తన బాల్య స్నేహితుడు మునీర్ అహ్మద్, అతడి కోచ్ రెహ్మతుల్లా బేగ్‌కు నివాళి అర్పించిన ఎమ్మెస్కే ప్రసాద్.. వారి గౌరవార్థం ఓల్డ్ సిటీలో ఈ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిభావంతులైన, పేద పిల్లలను వెలుగులోకి తీసుకురావడానికి నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ రంజీ ప్లేయర్లు, క్రికెటర్లు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్లే మట్టలోని మాణిక్యాలు వెలుగు చూస్తాయని పలువురు ప్రశంసిస్తున్నారు.