తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ రెండు రాష్ట్రాల్లో ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది.  ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్ జలసౌధలో నిన్న జరిగింది. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.


రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే విషయమై ఈ సమావేశంలో చర్చించారు. మే నెలాఖరు వరకు తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొన్నటి సీఈల సమావేశం తర్వాత వివరాలు సమర్పించాయి. ప్రస్తుతం రెండు జలాశయాల్లో కనీస వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఉన్న కొద్ది పాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది.


ముందుగా తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.  ఆ తర్వాత  ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన నీటిని ప్రణాళికతో వాడుకోవాలని తెలిపింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని రెండు రాష్ట్రాలకు సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: