
తిరుమలలో శ్రీవారికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తిరుమల కొండల్లోని పువ్వులన్నీ స్వామివారికే సమర్పిస్తారు. అలాగే ఆగమ శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు ఉంటాయి. వాటి ప్రకారం తిరుమల కొండలపై స్వామి వారిపైన ఎలాంటి విమానాలు తిరగకూడదు. అందుకే తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి లేఖ రాశారు.
ఆగమ శాస్త్రం, ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నో-ఫ్లై జోన్ గా తిరుమలను ప్రకటించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభ్యర్థించారు. తక్కువ ఎగిరే విమానాలు, ముఖ్యంగా హెలికాప్టర్లు, ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలిగిస్తుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖలో తెలిపారు.
తిరుమల యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి నో-ఫ్లై జోన్ ప్రకటన ముఖ్యమైన అడుగు అవుతుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. అందుకు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.