ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది ఉత్సవాల నిర్వహణకు అదనపు నిధుల కింద రూ.5 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 30 తేదీన విశ్వవసు నామ ఉగాది పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రస్థాయితో పాటు 26 జిల్లాలు, ఢిల్లీలోని ఏపీ భవన్, ఏపీ సచివాలయ అసోసియేషన్, చెన్నైలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్‌లలో ఉగాది ఉత్సవాల కోసం ఈ నిధులను కేటాయించారు.

రాష్ట్రస్థాయిలో జరిగే ఉగాది ఉత్సవంలో 76 కళారత్న అవార్డులు, 100 మందికి ఉగాది పురస్కారాలు, ఇతర వ్యయాల కోసం రూ.1.98 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉగాది పండుగ నిర్వహణకు రూ.2.60 కోట్లను కేటాయించగా, చెన్నైలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్, ఏపీ భవన్, ఏపీ సచివాలయంలో ఉత్సవాల నిర్వహణకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు. ఉగాదిని పురస్కరించుకుని పంచాగ శ్రవణం, విశిష్ట వ్యక్తులు, కళలు, కళాకారులకు పురస్కారాలను అందజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.


ఉగాది సందర్భంగా కవిసమ్మేళనం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఉత్సవాల ద్వారా తెలుగు సంప్రదాయాలను, సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు కళాకారులను సన్మానించే లక్ష్యంతో ఈ నిధులను వినియోగించనున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: