విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం, "సలామాలేకూమ్" అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "పేదలతో నేనుండాలనేదే నా జీవితాశయం. నూటికి నూరు శాతం పేదలను పైకి తీసుకొచ్చేందుకే ఈ నెల 30న పీ4 కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పేదరికంలో ఉన్న ప్రతీ ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం" అని హామీ ఇచ్చారు.


వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతామని, మత సామరస్యాన్ని కాపాడుతూ ముస్లిం మైనార్టీలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు. "ముస్లిం మైనార్టీలతో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ అనుబంధం ఉంది. సమైఖ్య ఆంధ్రలోనైనా, నవ్యాంధ్రలోనైనా ముస్లింలకు న్యాయం చేసింది తెలుగుదేశమే" అని వివరించారు.


ఉర్దూను రెండో భాషగా గుర్తించడంతో పాటు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతూ వచ్చామని, హైదరాబాద్, కర్నూల్‌లో ఉర్దూ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. అలాగే, హైదరాబాద్, కర్నూల్, విజయవాడల్లో హజ్ హౌస్ నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. రంజాన్ తోఫా ఇవ్వడంతో పాటు ఇమామ్‌లు, మౌజమ్‌లను ఆదుకున్న ఘనత తెలుగుదేశానిదేనని గుర్తు చేశారు.


ఈ ఏడాది బడ్జెట్‌లో గతంతో పోలిస్తే 1300 కోట్లు అదనంగా కేటాయించినట్లు సీఎం వెల్లడించారు. "ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతీ పేదవాడిని పైకి తీసుకొచ్చే కార్యక్రమమే పీ4" అని చంద్రబాబు వివరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: