సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ కేసీఆర్ తెలివికల్లవాడైనా విఫలమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం తప్పిదాలను గుర్తించి పొరపాట్లు జరగకుండా ముఖ్యమంత్రి జాగ్రత్త పడాలని సూచించారు. ఆరు గ్యారంటీల్లోని ఒక్కొక్క హామీని ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తున్నదని తెలిపారు. ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తేనే ప్రభుత్వానికి క్రిడిబులిటీ ఉంటుందని హెచ్చరించారు.


వచ్చే ఆదాయం చాలకపోవడంతో పాటు కేంద్రం నుంచి సహకారం లేకపోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. కేంద్రం మిథ్య అని ఎన్టీ రామారావు అనాడే చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీ రామారావు ఈ పరిస్థితిని ముందే గ్రహించారని వివరించారు. రాష్ట్రం నుంచి పోయేది ఎక్కువగా ఉండగా వచ్చే వాటా తక్కువగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వాటా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.


బయ్యారం స్టీల్ ప్లాంట్ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలోనే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉన్నదని గుర్తు చేశారు. ఒక్కో ఐఏఎస్‌కు మూడు కార్లు ఉన్నాయని ఒక పెద్దాయన చెప్పారని వెల్లడించారు. మంత్రులు అధికారులు దుబారా తగ్గించుకోవాలని సూచించారు.


స్కిల్ యూనివర్శిటి ఒక గొప్ప నిర్ణయమని ప్రశంసించారు. అక్షరాస్యత 62.4 శాతమే ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని సలహా ఇచ్చారు. పంటల బీమాను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: