మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజల ఆలోచనా విధానంపై, రాజకీయ పార్టీల వైఖరిపై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "సెలెక్షన్, కలెక్షన్, ఎలెక్షన్ అనే విధానం వల్ల దేశానికి, ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు ‘ఇది ఫ్రీ, అది ఫ్రీ’ అని అధికారం కోసం ప్రజలను మాయ చేస్తున్నారు," అని ఆయన విమర్శించారు. ఉచిత హామీలు ఇస్తే ఎవరూ కాదనరని, అందుకే రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయని ఆయన ఆరోపించారు.


వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, "క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండాక్ట్ ఉన్న వారిని ప్రజలు ఎన్నుకోవాలి. కానీ ప్రజలు కూడా క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ చూస్తున్నారు. ఆ నాలుగు సీలు పోయి, ఈ సీలను చూడటం విచారకరం," అని వ్యాఖ్యానించారు. కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందిన వారు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.

"రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి, తాత్కాలికంగా ఇచ్చే ఉచిత హామీలను నిలిపివేయాలి. ప్రజలు కూడా ఉచితాలకు ఆశపడి, మీ పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయొద్దని కోరుతున్నా," అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో వస్తున్న మార్పును గమనించి, రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇరవై నుంచి ముప్పై కోట్లు ఖర్చు చేస్తున్నారని, అంత డబ్బు పెట్టుబడి పెడితే వాటిని రాబట్టుకునేందుకే చూస్తారని ఆయన విమర్శించారు. "మన భవిష్యత్‌కు మనం ఓటు వేస్తున్నామని ప్రజలు ఆలోచించాలి," అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: