హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగిస్తూ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 1, 2025 నుంచి మెట్రో సేవలు రాత్రి 11:45 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు మాత్రమే నడుస్తున్న మెట్రో సేవలు, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కొత్త సమయం ప్రకారం నడుస్తాయని వెల్లడించారు. అలాగే, ఆదివారాల్లో టెర్మినల్ స్టేషన్‌ల నుంచి మొదటి రైలు ఉదయం 7:00 గంటలకు సేవలు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.


విద్యార్థుల సౌకర్యార్థం 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్‌ను మరో సంవత్సరం పొడిగించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ఆఫర్ 2026 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, 2024 ఏప్రిల్‌లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ (SSO) మరియు ఆఫ్-పీక్ తగ్గింపు ఆఫర్‌లు 2025 మార్చి 31తో ముగియనున్నాయని వెల్లడించారు.


అంతేకాక, మెట్రో ప్రయాణికుల సౌలభ్యం కోసం సరికొత్త టి-సవారీ మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఈ అప్లికేషన్ ద్వారా ప్రయాణికులు మరింత సులభంగా సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: