హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫోన్ టాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ కొనసాగిస్తోంది. జూబ్లీహిల్స్ ఎసిపి వెంకట గిరి నేతృత్వంలో జరుగుతున్న ఈ విచారణ నిన్న ఐదు గంటలకుపైగా జరిగింది.  రాత్రి 8 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది.


విచారణలో భాగంగా శ్రవణ్ రావును పలు కీలక అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఫోన్ టాపింగ్ పరికరాలను ఎక్కడ కొనుగోలు చేశారు, సర్వర్ కేంద్రాలను ఎవరి ఆదేశాలతో ఏర్పాటు చేశారు, గత భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో శ్రవణ్ రావుకు ఉన్న పరిచయాలు ఏమిటి అనే అంశాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. అంతేకాక, శ్రవణ్ రావు అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు, కాల్ డేటా ఆధారంగా ఎవరితో టచ్‌లో ఉన్నారు అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు.


ఫోన్ టాపింగ్ కేసు తెరపైకి వచ్చిన తర్వాత శ్రవణ్ రావు పరారై, విదేశాల్లో తలదాచుకున్నాడు. ఈ క్రమంలో ఆయన లండన్, ఆ తర్వాత అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ఈ విదేశీ ప్రాంతాల్లో ఆయన ఎక్కడెక్కడ తలదాచుకున్నాడు, ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు అనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో కీలక సూత్రధారి ఎవరు అనే కోణంలో కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు.


ఈ కేసు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ టాపింగ్ ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రవణ్ రావు విచారణ ఈ కేసులో మరింత స్పష్టత తీసుకురావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR