లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "పది సంవత్సరాలుగా (17వ, 18వ లోక్‌సభలో) డిప్యూటీ స్పీకర్ లేకపోవడం దౌర్భాగ్యం. ఆర్టికల్ 93 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను నియమించాల్సి ఉంటుంది, కానీ కేవలం స్పీకర్‌ను మాత్రమే పెట్టి, స్పీకర్ ఆఫీస్ నుంచి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు," అని ఆయన విమర్శించారు.


చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, లోక్‌సభలో ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు ఉండాల్సి ఉన్నప్పటికీ, వారి గొంతును నొక్కుతున్నారని ఆరోపించారు. "BAC (బిజినెస్ అడ్వైజరీ కమిటీ)ని పాటించట్లేదు, స్టాండింగ్ కమిటీ సిఫార్సులను పట్టించుకోవడం లేదు. సభలో అడ్జర్న్‌మోషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. జీరో అవర్, క్వశ్చన్ అవర్‌లో ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే హక్కులు ఉంటాయి, కానీ అవి కూడా ఇవ్వడం లేదు," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా మైక్ కట్ చేసి, స్పీకర్ ఓం బిర్లా సభ నుంచి వెళ్లిపోయిన సంఘటనను ఆయన ప్రస్తావిస్తూ, "సన్సద్ టీవీలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన దాన్ని చూపించకుండా, కేవలం అధికార పక్షం వారి మాటలను మాత్రమే ప్రసారం చేస్తున్నారు. డిస్కషన్ అండర్ రూల్ 193ని కూడా రద్దు చేశారు. దేవాలయం లాంటి పార్లమెంట్ వివక్షతకు గురవుతోంది," అని విమర్శించారు.


ఈ అంశంపై మార్చి 27న ప్రతిపక్ష పార్టీ ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసినట్లు చామల తెలిపారు. "మేము ఇచ్చిన రిప్రజెంటేషన్‌ను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలి. లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు ఉండాలి," అని ఆయన డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: