
పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాటలను గుర్తు చేస్తూ, కార్యకర్తలు సొంతకాళ్లపై నిలబడాలని, వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని అన్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు హెరిటేజ్ అనే విత్తనం నాటారని, అయితే తమ ఖర్చుల కోసం రాజకీయాలపై ఆధారపడే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.
కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన లోకేష్, ప్రమాద బీమాను మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, కొందరు కార్యకర్తలు చిన్న విషయాలకు అలిగి, మనస్పర్థలతో దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అలకలకు వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించారు. చిన్న కుటుంబంలోనే గొడవలు ఉంటే, ఇంత పెద్ద పార్టీలో ఉండకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఇన్‌ఛార్జ్ మంత్రులను సంప్రదించాలని, గ్రామస్థాయి సమస్యలను తహశీల్దార్, వీఆర్‌వోలు చూడాలని ఆదేశించారు. గ్రామాల నుంచి చిన్న సమస్యలను తన వద్దకు తీసుకొస్తున్నారని, ఇది స్థానికంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.