
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పాయకరావుపేటకు ఏలేరు కాలువ నీటిని పైప్‌లైన్ ద్వారా తీసుకురావడానికి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నాతవరం మండలం శరభవరం వద్ద మోటారు ఏర్పాటు, షెడ్డు నిర్మాణం జరిగాయి. 2017లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అనిత ఈ పనులను మొదలుపెట్టగా, అప్పటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఎన్ఆర్డీడబ్ల్యూపీ కింద రూ.51 కోట్ల నిధులను కేటాయింపజేశారు. అయితే, వైసీపీ హయాంలో ఈ పనులు నిలిచిపోయాయి.
140 గ్రామాలకు పైప్‌లైన్ల ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణం కోసం రూపొందించిన ఈ ప్రాజెక్టులోని అడ్డంకులను హోం మంత్రి అనిత నిర్వహించిన సమీక్ష ద్వారా తొలగించారు. ఆమె చొరవతో రూ.87 కోట్లతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కానుంది. దీంతో 140 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యం సాకారం కానుందని అధికారులు తెలిపారు. ఈ సమీక్ష ద్వారా ప్రాజెక్టు పురోగతికి కొత్త ఊపు లభించిందని, త్వరలోనే పనులు పూర్తి చేసి గ్రామీణ ప్రజలకు నీటి సమస్య నుంచి విముక్తి కల్పిస్తామని హోం మంత్రి అనిత వెల్లడించారు.