కర్ణాటకలో హనీట్రాప్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సులభంగా ఆదాయం పొందేందుకు కొంతమంది దుండగులు యువతులను ఉపయోగిస్తున్నారు. ఇటీవల శ్రీదేవి రోడగి (25) అనే ప్రీ-స్కూల్ ఉపాధ్యాయురాలు, చిన్నారుల తండ్రులను టార్గెట్ చేసిన సంఘటన బయటపడింది. మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ అధికారుల వివరాల ప్రకారం, ఒక 34 ఏళ్ల పారిశ్రామికవేత్త తన బిడ్డను స్కూల్‌కు తీసుకెళ్లే సమయంలో శ్రీదేవితో స్నేహం చేశాడు. 2024లో తన తల్లికి ఆపరేషన్ కోసం అంటూ అతడి నుంచి రూ.4 లక్షలు స్వీకరించింది.


డబ్బు తిరిగి చెల్లించమని అడిగినప్పుడల్లా ఆమె ఆలస్యం చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితిలో అతడితో సన్నిహితంగా ఉన్నట్లు నటించి, ముద్దు ఇస్తూ ఫోటో తీసి ఆ ఆధారంతో బెదిరింపులకు పాల్పడింది. తన ప్రియుడు, రౌడీషీటర్ సహాయంతో రూ.50 వేలు వసూలు చేసింది. ఆ తర్వాత రూ.15 లక్షలు డిమాండ్ చేస్తూ ఒత్తిడి పెంచడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలోనూ ఇలాంటి ఫోటోలతో బెదిరించి డబ్బు గుంజినట్లు పోలీసులు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ప్రాథమిక విచారణ తర్వాత శ్రీదేవి, ఆమె ప్రియుడు సాగర్ మోరే (28), రౌడీషీటర్ గణేశ్ కాళే (38)లను పోలీసులు పట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: