జాతీయ బ్యాంకులకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలలో చిల్లర నాణేలను సేకరించిన బ్యాంకుల్లోనే, అంతే మొత్తం నగదు డిపాజిట్ చేస్తామంటున్నారు స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి.
దీంతో పరాకమణి నుంచి చిల్లర నాణేలు సేకరించేందుకు ముందుకు వస్తున్నాయి బ్యాంకులు. ఇప్పటికే విజయా బ్యాంకు,బ్యాంక్ ఆఫ్ బరోడాలు తమ సంసిద్దత వ్యక్తం చేసాయి. దీంతో రెండేళ్లకు పైగా టీటీడీని వేధిస్తున్న చిల్లర సమస్యకు పరిష్కారం లభించినట్టైంది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు.స్వామివారి దర్శనార్ధం విచ్చేసిన భక్తులు తమ మొక్కులు చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తారు. ఇలా ప్రతి నిత్యం శ్రీవారికి హుండి ద్వారా 3 నుంచి 5 కోట్లు వరకు ఆదాయం లభిస్తుంటుంది.ఇందులో ఎక్కువ మొత్తం నగదు రూపంలోనే లభిస్తున్నా...ప్రతి నిత్యం 8 నుంచి 20 లక్షల వరకు కూడా నాణేలు ద్వారా లభిస్తుంది. గతంలో శ్రీవారి ఆలయంలో పరకామణిలో కానుకలు లెక్కించిన తరువాత వాటిని బ్యాంకులో డిపాజిట్ చేస్తుండేది టీటీడీ. ఇంతవరకు బాగానే వున్నా రెండేళ్ల క్రితం ఆర్బీఐ ఆంధ్రా బ్యాంకును నోడల్ బ్యాంకుగా నియమించింది. చిల్లర నాణేలు ఆంధ్రా బ్యాంకు ద్వారానే ఏ బ్యాంకు అయినా సేకరించాలి అంటూ నిబంధన విధించింది. కొత్త నిబంధనతో చిల్లర నాణేలు సేకరణ ద్వారా తమకు ఎలాంటి ఆదాయం లేదంటూ బ్యాంకులు అన్ని కూడా నాణేలు సేకరణకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.
బ్యాంకులు ఏవి కూడా ముందుకు రాకపోవడంతో , నాణేలు తరలింపుకు సంబంధించిన వ్యయాన్ని భరించేలా ఆంధ్రా బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది టీటీడీ. గత ఏడాది మార్చి వరకు కూడా ఆంధ్రా బ్యాంకులోనే నాణేలను డిపాజిట్ చేస్తూ వచ్చింది.ఆంధ్రా బ్యాంకులో స్థలాభావం దృష్ట్యా, 2018 ఏప్రిల్ నుంచి టీటీడీ నుంచి నాణేల సేకరణను నిలిపివేసింది. 2018 ఏప్రిల్ నుంచి కూడా ఆంధ్రా బ్యాంకు నాణేలు సేకరణ చేపట్టకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి టీటీడీ వద్ద 49 వేల చిల్లర బ్యాగులు నిల్వలుగా పేరుకు పోయ్యాయి.వీటి విలువ కూడా 20కోట్లు దాటేసింది.దీనికి సంబంధించి ఆంధ్రా బ్యాంకు,ఆర్ బిఐ అధికారులు దృష్టికి టీటీడీ తీసుకువెళ్ళినా...ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయ్యింది. మరోవైపు ఈ 9 నెలలు కాలానికి 20 కోట్ల రూపాయలు నిల్వలు టీటీటీ వద్దే వుండిపోవడంతో....వడ్డీ రుపేణా 65 లక్షల రూపాయలు కోల్పోయింది. సమస్య తీవ్రత దృష్ట్యా ప్రత్యామ్నాయం ఏర్పాట్లపై దృష్టి సారించింది టీటీడీ. దీంతో చిల్లర నాణేలు సేకరణకు ఫెడరల్ బ్యాంకు ముందుకు వచ్చింది. 5 శాతం వ్యయం క్రింద చెల్లిస్తే...చిల్లర నాణేలు సేకరణ ప్రారంభిస్తామని ఫెడరల్ బ్యాంకు ప్రతిపాదనలు తీసుకురావడంతో ఈ అంశంపై చర్చించిన టీటీడీ పాలకమండలి.....టెండర్లు ప్రకియ ద్వారా బ్యాంకులు చిల్లర నాణేలను సేకరించే పనులను అప్పగించాలని టీటీడీ ఈవోకు సూచించింది. టెండర్ విధానంలో కూడా ఫెడరల్ బ్యాంకు మాత్రమే సంసిద్దత వ్యక్తం చెయ్యడంతో చివరికి చిల్లర నాణేలు తరలింపు బాధ్యతలను ఫెడరల్ బ్యాంకుకే అప్పగించింది టీటీడీ.
ఫెడరల్ బ్యాంకు కూడా టీటీడీ అవసరాలకు సరిపడిన విధంగా చిల్లర నాణేలు సేకరణ చెయ్యకపోవడంతో నిల్వలు అదే స్థాయిలో వుండిపోయాయి. దీంతో ఈ సమస్యకు శాశ్వత ప్రాతిపాదికన పరిష్కారం కోసం స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి బ్యాంకులకు ఆఫర్ ఇచ్చారు. చిల్లర నాణేలు సేకరించిన బ్యాంకులకు అంతే మొత్తంలో.. నగదు డిపాజిట్ టీటీడీ తరపున చేస్తామంటూ ప్రతిపాదించారు. టెండర్ విధానాలు వలన డిపాజిట్ లు పొందడంలో ఇంతకాలం విఫలవుతున్న బ్యాంకులు టీటీడీ ముందు క్యూ కట్టాయి. ఈ ప్రతిపాదన తమకు ఒకే అంటూ విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంసిద్దతను వ్యక్తం చేసాయి. మరికొన్ని బ్యాంకులు కూడా ముందుకు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు.